23 June 2019

Grama Volunteers Recruitment in AP 2019 - Online Applications, Qualifications, Salaries and Selection Interviews

గ్రామ వాలంటీర్లకు రేపట్నుంచి దరఖాస్తులు

2 లక్షల మంది ఎంపికకు నేడు జిల్లాల్లో ప్రకటనల జారీ
జులై 11 నుంచి ఇంటర్వ్యూలు
ఆగస్టులో శిక్షణ
స్వాతంత్య్ర దినోత్సవాన కొత్త వ్యవస్థకు శ్రీకారం

గ్రామాల్లో యాభై కుటుంబాలకో వాలంటీర్‌ చొప్పున నియామకం కోసం సోమవారం నుంచి దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. ఈ మేరకు ఆది, సోమవారాల్లో జిల్లాల వారీగా కలెక్టర్లు ప్రకటనలు (నోటిఫికేషన్లు) జారీ చేస్తారు. అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించాక మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో), తహసీల్దార్‌, పంచాయతీరాజ్‌- గ్రామీణాభివృద్ధి కార్య నిర్వహణాధికారి(ఈవో)లతో కూడిన భాగస్వామ్య కమిటీ ఎంపికలు పూర్తి చేస్తుంది. 50 శాతం పోస్టుల్ని మహిళలకు కేటాయించనున్నారు. నవరత్నాల్లో భాగంగా గ్రామాల్లో వాలంటీర్ల నియామకానికి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి వెళ్లిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం వీటిని ఆమోదిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆశించిన స్థాయిలో పనితీరు కనపరచని వాలంటీర్లను తొలగించే అధికారం అధికారులకు ఉంది.
దరఖాస్తు చేసుకోవడం ఎలా?

అభ్యర్థులు http://gramavolunteer.ap.go v.in వెబ్‌సైట్‌ లింకులో దరఖాస్తులు అప్‌లోడ్‌ చేయాలి. మండల స్థాయి కమిటీ వీటిని పరిశీలించి అర్హులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తుంది. ఎంపికైన వాలంటీర్లను గ్రామ పంచాయతీల పరిధిలో ఎక్కడెక్కడ నియమించాలో ఎంపీడీవోయే నిర్ణయిస్తారు.
గౌరవ వేతనం?

వాలంటీర్లకు నెలకు రూ.5,000 గౌరవ వేతనం చెల్లిస్తారు. దీనికింద ఏటా రూ.1,200 కోట్లు అవసరం. ఎంపిక, శిక్షణలకు ప్రాథమికంగా రూ.13.50 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
పనితీరు సమీక్షకు ప్రత్యేక వ్యవస్థ

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ పేర్కొనే విధులు, బాధ్యతల మేరకు వాలంటీర్లు పని చేయాలి. మండల స్థాయిలో ఎంపీడీవోలు, గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు వీరి పనితీరును సమీక్షిస్తారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలోనూ ప్రత్యేక పరిశీలన వ్యవస్థ పనిచేయనున్నది.
ప్రజల ఇళ్ల ముంగిటకే ప్రభుత్వ సేవలు
నవరత్నాల్లో భాగంగా కులం, మతం, వర్గం, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజల ఇళ్ల ముంగిటే ప్రభుత్వ సేవలందించే ఉద్దేశంతో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. సంక్షేమ పథకాల్లో అవకతవకలు, అవినీతి, అక్రమాలను నిరోధిస్తూ ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలన్నదే కార్యక్రమ ధ్యేయమని జీవోలో వివరించారు. విధి నిర్వహణలో భాగంగా వాలంటీర్లు తమ దృష్టికి వచ్చే ప్రజా సమస్యలను సైతం గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించేలా వ్యవస్థను రూపొందించారు.
పట్టణాలకు మరో జీవో

నగరాలు, పట్టణాల్లోనూ 50 కుటుంబాలకో వాలంటీర్‌ నియామకానికి ప్రభుత్వం మరో జీవో జారీ చేయనుంది. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ నుంచి వెళ్లిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. వీటిలో స్వల్పమార్పులు చేసి సోమవారం తర్వాత జీవో విడుదల చేసే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. పట్టణాల్లో వాలంటీర్ల విద్యార్హత డిగ్రీగా నిర్ణయించారు. వీరి ఎంపిక కమిటీలో పురపాలక, నగరపాలక కమిషనర్‌లు కీలకం కానున్నారు.

Latest Jobs