08 October 2019

Telangana TSTET Latest Updates 2019

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) కోసం అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. టెట్‌ నిర్వహణకు అనుమతించాలని కోరుతూ ప్రభుత్వానికి పాఠశాల విద్యా శాఖ నాలుగు నెలల క్రితం ప్రతిపాదనలు పంపించింది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అధికారులు తెలిపారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంది. దీంతో అభ్యర్థులు ఈ పరీక్షపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. మార్కులు పెంచుకునేందుకు మళ్లీ మళ్లీ టెట్‌కు హాజరవుతున్నారు.

ప్రైవేటు స్కూళ్లలో టీచర్‌గా పని చేసేందుకు కూడా టెట్‌ అర్హతను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు భారీ సంఖ్యలో టెట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు గతంలో నిర్వహించిన మూడు టెట్ల కాల పరిమితి ముగిసింది. ఒకసారి టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థికి ఏడేళ్ల వరకు కాల పరిమితి ఉంటుంది. దాటితే మళ్లీ టెట్‌ పరీక్ష రాయాలి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్లలో కేవలం రెండుసార్లే (2016 మే 22న, 2017 జులై 23న) టెట్‌ నిర్వహించారు. ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం ఏటా రెండుసార్లు నిర్వహించాలి. కానీ, ప్రభుత్వం ఏడాదికి ఒకసారే నిర్వహించేలా 2015 డిసెంబరు 23న ఉత్తర్వులు జారీ చేసింది.

దాని ప్రకారమైనా 2018, 2019లోనూ టెట్‌ నిర్వహించాలి. రాష్ట్రంలో సుమారు మూడు లక్షల మంది వరకు అభ్యర్థులు టెట్‌ కోసం నిరీక్షిస్తుండటం గమనార్హం.